సిఎం కెసిఆర్ చేతుల మీదుగా రేపు చెక్కుల పంపిణీ

 కెసిఆర్ బుధవారం మెదక్ పర్యటన ముగించుకొన్న తరువాత సాయంత్రం కరీంనగర్ చేరుకొని తీగల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ లో రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 11 గంటలకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్ చేరుకొని అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుబంధు (పంట పెట్టుబడి) చెక్కులు, కొత్త పాస్ పుస్తకాలను సిఎం కెసిఆర్ స్వయంగా రైతులకు అందజేస్తారు. 

ఈ చెక్కులు, పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించాలని తెరాస సర్కార్ భావిస్తోంది కనుక, తెరాస నేతలు సిఎం కెసిఆర్ పాల్గొనబోయే రేపటి కార్యక్రమానికి చాలా బారీగా ఏర్పాట్లు, జనసమీకరణ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచే కాక రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి బారీ సంఖ్యలో రైతులను తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ముఖ్యమంత్రి కెసిఆర్ కు స్వాగతం పలుకుతూ అడుగడుగునా స్వాగతతోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కరీంనగర్ పట్టణంలో తెలంగాణా చౌక్, కోతిరాంపూర్, అలుగునూరు, మానకొండూరు, శంకపట్నం, హుజూరాబాద్, చెల్కూర్ తదితర ప్రధానకూడళ్ళ వద్ద మహిళలు మంగళహారతులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ను స్వాగతించబోతున్నారు. ఇక సభ ప్రారంభం అయ్యేవరకు తెలంగాణా సంస్కృతిని ప్రతిభింబించే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సభకు సుమారు 50-60 వేలమంది హాజరుకావచ్చని తెరాస నేతలు అంచనా వేస్తున్నారు. కనుక తెరాస నేతలు, జిల్లా అధికారులు, పోలీసులు అందుకు తగ్గట్లుగానే బారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.   

వేసవి ఎండా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సభను ఒక్క గంటలో ముగించబోతున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఉదయం 11 గంటలకు సభను ప్రారంభించిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా కొందరు రైతులకు చెక్కులు, పాస్ బుక్కుల పంపిణీ చేస్తారు. ఆ తరువాత కొద్దిసేపు క్లుప్తంగా ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12గంటలకల్లా సభ ముగుస్తుంది. 

రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలలో రైతులకు రైతుబంధు చెక్కులు, కొత్త పాసుపుస్తకాల పంపిణీ జరుగబోతోంది. కనుక రేపు రాష్ట్రమంతటా పండగ వాతావరణం ఏర్పడనుంది.