
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పధకంలో అవకతవకలు జరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీకే చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గపు ఇన్-ఛార్జ్ లు, పార్టీ నేతలు, అధికారులు ఈ అవకతవకలకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. వాటిని తెరాస నేతలు నిరాధారమైన ఆరోపణలని కొట్టిపడేసినప్పటికీ, ఇళ్ళ కేటాయింపులలో అవకతవకలు జరిగాయంటూ మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట తదితర జిల్లాలలో స్థానికులు ఆందోళనలు చేస్తుండటంతో సిఎం కెసిఆర్ దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు.
ఏఏ జిల్లాలలో ఎన్ని ఇళ్ళు నిర్మించబడుతున్నాయి? అవి ప్రభుత్వ స్థలాలలో నిర్మించబడుతున్నాయా లేక ప్రైవేట్ స్థలాలలో నిర్మించబడుతున్నాయా? ప్రైవేట్ స్థలాలలో అయితే గత ఏడాది కాలంలో ఆ స్థలాలు ఎన్ని చేతులు మారాయి? వాటిని అంతిమంగా ఎవరు కొనుగోలు చేశారు? లాటరీ పద్ధతిలో కేటాయించవలసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నేరుగా ఎంతమందికి కేటాయించారు? ఆవిధంగా కేటాయించాలని ఎవరు, ఎందుకు నిర్ణయించారు? ఇళ్ళు పొందినవారు నిజంగా అర్హులేనా కాదా? మొదలైన అంశాలపై తక్షణమే దర్యాప్తు జరిపి 48 గంటలలో నివేదిక సమర్పించవలసిందిగా సిఎం కెసిఆర్ నిఘా విభాగం అధినేత నవీన్ చంద్ ను ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు నిఘా అధికారులు వెంటనే రంగంలో దిగి ‘పని’ మొదలుపెట్టేయడంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు స్థలాలు కొనుగోలు చేయడంలో, ఇళ్ళ కేటాయింపులో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారి హడలిపోతున్నారు.
భద్రాచలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపులో చాలా అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్ గుర్తించడంతో భద్రాద్రి ఎంఆర్వో ను శలవుపై పంపించి, జిల్లా సబ్ కలెక్టర్ చేత విచారణ మొదలుపెట్టారు. సాధారణంగా అధికార పార్టీలో ఉన్నవారు ప్రభుత్వ పధకాలలో వేలు పెడుతుంటం సహజమే. వివిధ ప్రాజెక్టులలో తెరాస సర్కార్ అవినీతికి పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నప్పుడు, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగితే వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు ప్రభుత్వం మంచిచేయబోతే చెడు ఎదురయినట్లు అవుతుంది. కనుక దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించి అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవడం చాలా అవసరమే. మంచి నిర్ణయమే.