
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సోమవారం కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతిపత్రం అందించారు. తమ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పి 20 రోజులు అయినప్పటికీ, ఇంతవరకు వారి సభ్యత్వాన్ని పునరుద్దరించకుండా తెరాస సర్కార్ తాత్సారం చేస్తోందని, హైకోర్టు తీర్పును అది గౌరవించడంలేదని కనుక వారిరువురి సభ్యత్వాన్ని తక్షణమే పునరుద్దరించాలని స్పీకర్ ను ఆదేశించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలలో ప్రధానప్రతిపక్ష పార్టీని సస్పెండ్ చేసి తెరాస సర్కార్ శాసనసభను తనకు నచ్చినట్లు నడిపించుకొని చాలా అప్రజాస్వామికంగా వ్యవహరించిందని వారు గవర్నర్ నరసింహన్ కు పిర్యాదు చేశారు. తెరాస సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనలకు, కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఈరోజు గవర్నర్ నరసింహన్ ను కలిసినవారిలో జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, సురేష్ రెడ్డి, దాసోజు శ్రవణ్, వంశీ చంద్ రెడ్డి తదితరులున్నారు. సంపత్ కుమార్ రాజ్ భవన్ కు వచ్చినప్పటికీ బయటే ఉండిపోగా రేవంత్ రెడ్డి అసలు రానేలేదు.