
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12వ తేదీన జరుగబోతున్నాయి. అంటే ప్రచారం ముగించడానికి ఇంకా 3 రోజులు, పోలింగ్ కు 5 రోజులు మాత్రమే సమయం ఉందన్నమాట! ఈ ఎన్నికలలో కాంగ్రెస్, భాజపాల మద్యే పోటీ ప్రధానంగా ఉంది కనుక రెండూ ఇవి జీవన్మరణసమస్య అన్నట్లుగా చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికలలో గెలిచి తన సత్తా చాటుకోవాలని జెడిఎస్ కూడా గట్టిగా ప్రచారం చేస్తోంది. దానికి ఆ నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించిన వ్యక్తి సిఎం కెసిఆర్ అని చెప్పకతప్పదు.
ఎన్నికల ప్రచారం ఇక ముగిసే సమయం దగ్గరపడుతున్నవేళ ‘జనతాకీ బాత్’ అనే ఒక సంస్థ సర్వే చేసి ఫలితాలపై జోస్యం చెప్పింది. ఈసారి ఎన్నికలలో భాజపా గెలువబోతోందని అది స్పష్టం చేసింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో కలిపి మొత్తం 1.20 లక్షల మందిని ప్రశ్నించగా వారిలో అత్యధికులు ప్రభుత్వ మార్పును కోరుకొంటున్నట్లు తేలిందని ఆ నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీకి ఈసారి 72-75 సీట్లు, భాజపాకు 102-108, జెడిఎస్:42-44, ఇతరులకి 2 నుంచి 4 సీట్లు లభించవచ్చని పేర్కొంది.
ఎన్నికలకు రెండు నెలల క్రితం వెలువడిన సర్వే ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తుందని పేర్కొంటే, ఎన్నికల ప్రచారం ఊపందుకొన్నాక చేసిన సర్వేలో రెండు పార్టీలకు సరిసమానంగా సీట్లు రావచ్చని కనుక ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడే అవకాశం ఉందని జోస్యం చెప్పింది. ఇప్పుడు భాజపా విజయం సాధిస్తుందని సర్వే జోస్యం చెపుతోంది. ఈ సర్వే నిజమైతే భాజపా ఎన్నికల వ్యూహాలు, దాని నేతల ఎన్నికల ప్రచారం కన్నడ ప్రజలపై చాలా ప్రభావం చూపాయని భావించవలసి ఉంటుంది.