ఉద్యమకేసులున్నాయా..అయితే సంప్రదించండి

తెలంగాణా సాధన కోసం జరిగిన ఉద్యమాలలో పోలీసులు అనేక వేలమందిపై కేసులు నమోదు చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో అత్యధిక కేసులను ఉపసంహరించుకొంది. కానీ న్యాయపరమైన కొన్ని కారణాల చేత ఇంకా అనేక కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోలేకపోయింది. కనుక నేటికీ అనేకమంది ఉద్యమకారులు పోలీస్ స్టేషన్ ల చుట్టూ..కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసికక్షోభ అనుభవిస్తున్నారు. 

వారిపై కూడా కేసులను ఎత్తివేసేందుకు మంత్రులు కేటిఆర్, జగదీశ్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింసింహారెడ్డి కార్యాలయంలో సమావేశమయ్యి చర్చించారు. ఆ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావులతో సహా మరికొంత మంది ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆ కేసులను ఎత్తివేయాలని ఉన్న అవరోధాల గురించి చర్చించారు. సదరు ఉద్యమకారులతోనే నేరుగా మాట్లాడి ఈ కేసులను ఎత్తివేయడానికి గల అన్ని అవకాశాలను పరిశీలించాలని వారు నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఉద్యమకారులపై కేసులను ఎత్తివేసి వారికి ఉపశమనం కలిగించాలని నిర్ణయించారు. కేసులు ఎదుర్కొంటున్న సదరు ఉద్యమకారులు 040-23451073 నెంబరుకు ఫోన్ చేసి మాట్లాడాలని మంత్రి నాయిని నర్సింసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. అదిగాక తమ కేసుకు సంబంధించిన వివరాలను contact@trspartyonline.orgకు లేదా వాట్సాప్‌ నంబర్‌ 8143726666 కు పంపవచ్చని సూచించారు. లేదా nnreddy.hm@gmail.comకు తమ వివరాలు పంపించివచ్చని చెప్పారు. కనుక ఇంకా కేసుల నిమిత్తం కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు తక్షణమే పోలీస్ లేదా తెరాసను ఆన్-లైన్ లేదా పైన పేర్కొన్న ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదిస్తే మంచిది.