ఇటీవల టి.ఎస్.పి.ఎస్.సి. జారీ చేసిన టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టిఆర్టి) హాల్ టికెట్స్ లో చాలా తప్పులు దొర్లడంతో అభ్యర్ధులు తీవ్ర ఆందోళన చెందారు. వారు నిన్న టి.ఎస్.పి.ఎస్.సి. కార్యాలయం వద్ద ఆందోళన చేసి తమ నిరసన తెలియజేశారు. వివిధ జిల్లాలలో అభ్యర్ధులు కూడా ఆందోళన చెందుతున్నారు.
అభ్యర్ధులు ఎంచుకొన్న మూడు జిల్లాలలో కాకుండా వాటికి దూరంగా ఉండే జిల్లాలలో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తూ హాల్ టికెట్స్ జారీ చేయడమే వారి ఆందోళనకు కారణం. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) కంప్యూటర్లలలో సాంకేతిక తప్పిదం కారణంగా హాల్ టికెట్స్ లో తప్పులు దొర్లినట్లు గుర్తించిన టి.ఎస్.పి.ఎస్.సి. అధికారులు తమ వెబ్ సైట్ లో ‘డౌన్ లోడ్ హాల్ టికెట్స్ లింక్’ ను తాత్కాలికంగా తొలగించారు. ఆ లోపాలను సవరించి మళ్ళీ నేటి నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనుక ఇదివరకు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకొన్నవారితో సహా అభ్యర్ధులు అందరూ మళ్ళీ కొత్త హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని టి.ఎస్.పి.ఎస్.సి.అధికారులు విజ్ఞప్తి చేశారు.