ఆ మంత్రి హత్య కేసులలో నిందితుడు: కోమటిరెడ్డి

కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య తరువాత కాంగ్రెస్, తెరాసల మద్య మొదలైన మాటల యుద్ధం నానాటికీ తీవ్ర రూపం దాల్చుతోంది. మంత్రి జగదీశ్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. అయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ నేతల అంతర్గత గొడవల కారణంగానే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని, దానితో తెరాసకు ఎటువంటి సంబందమూ లేదని చెపుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమనుకొంటే నిందితుల కాల్ డేటాను కోర్టుకు సమర్పిస్తే న్యాయస్థానమే ఎవరు దోషులో నిర్ణయిస్తుంది కదా? నువ్వు చెప్పిందే నిజమనుకొంటే, సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే ఈ హత్యకు ఎవరు కారకులో తేలిపోతుంది కదా! ఒకవేళ మేమే హత్య చేయించామని రుజువయితే మేము జైలుకు వెళతాము లేకుంటే తెరాస నేతలు జైలుకు వెళతారు. సిబిఐ దర్యాప్తుకు మేము సిద్దమని చెపుతుంటే మీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అధికారం మీ చేతిలోనే ఉంది కదా? సిబిఐ దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా?

హత్యా రాజకీయాలు చేసే సంస్కృతి కాంగ్రెస్ లో లేదు. మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి పేరు నూక బిక్షం, కడారి రాములు హత్య కేసులలో ఉన్నమాట వాస్తవమా కాదా? మద్యపాన నిషేధం సమయంలో మద్యం సేవించి సూర్యాపేటలో పోలీసులకు పట్టుబడిన మాట వాస్తవమా కాదా? మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాజకీయాలలో నువ్వు ఒక బచ్చా. రాజకీయాల గురించి నీకేమి తెలుసు? ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయాల నుంచి తప్పుకొన్న మరుక్షణం హరీష్ రావు, కేటిఆర్, మీరందరూ కొట్లాడుకొని రోడ్డున పడటం ఖాయం. నీ మంత్రి పదవి మహా అయితే మరో ఆరు నెలలు ఉంటుందని తెలుసుకో,” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.