ఆఫ్ఘానిస్తాన్ లో దారుణం!

ఆఫ్ఘనిస్తాన్ లో దారుణం జరిగింది. జలాలాబాద్ పట్టణంలో ఉన్న ‘సేవ్ ది చిల్డ్రన్’ అనే చిన్నపిల్లల సంరక్షణాలయంపై ఉగ్రవాదులు ఈరోజు ఉదయం దాడి చేశారు. మొదట ఆ సంస్థ ద్వారం వద్ద కారుబాంబు పేల్చిన తరువాత కొంతమంది ఉగ్రవాదులు తుపాకులతో లోపలకు ప్రవేశించి కనబడినవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బయట ప్రేలుడు శబ్దం వినిపించగానే ఆ సంస్థలో పనిచేస్తున్నవారు కొందరు వెనుక ద్వారం గుండా కొంతమంది చిన్నారులను ఎత్తుకొని బయటకు పరుగులు తీశారు. ఉగ్రవాదుల దాడిలో 11 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారి దాడిలో అనేకమంది చిన్నారులు చనిపోయి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. 

ఈ సమాచారం అందుకోగానే భద్రతాదళాలు అక్కడకు చేరుకొని భవనాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు ఆ భవనం పై అంతస్తుకు చేరుకొని అక్కడి నుంచి భద్రతాదళాలపై ఎదురుకాల్పులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


కొన్ని రోజుల క్రితమే ఉగ్రవాదులు కాబూల్ నగరంలో ఒక హోటల్ పై ఆకస్మికంగా దాడిచేసి 22 మందిని చంపేశారు. ఇప్పుడు అభంశుభం తెలియని చిన్నపిల్లలను కాల్చి చంపడం చాలా దారుణం. జలాలాబాద్ పట్టణం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం చేత తరచూ పాక్ ఉగ్రవాదులు పట్టణంలోకి ప్రవేశించి ఇటువంటి హేయమైన దాడులకు పాల్పడుతూనే ఉంటారు. ఈ దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ తమదే భాద్యత అని ప్రకటించుకొనప్పటికీ, అక్కడే తిష్ట వేసిన తాలిబాన్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను అణచివేయకపోతే, తమ సైనికులు పాక్ లో ప్రవేశించవలసి వస్తుందని కొన్ని రోజుల క్రితమే అమెరికా హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్ లో వరుసగా జరుగుతున్న దాడులను చూస్తే నేడో రేపో అమెరికా అన్నంత పనీ చేస్తుందేమో?