టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యమంత్రి కెసిఆర్ తీరును తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను శత్రువులన్నట్లు పోలీసులతో అణచివేయిస్తూ, తెలంగాణా ద్రోహులను, తెలంగాణా వ్యతిరేక శక్తులను వెనకేసుకువస్తున్నారని ఆరోపించారు. దీనిని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో రైతులు తమ పొలాలు ఎండిపోతున్నాయనే ఆవేదనతో నీళ్ళు విడుదల చేయమని రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే సిగ్గుపడాల్సిన తెరాస సర్కార్, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి పోలీసులతో రైతుల నోళ్ళు మూయించడానికి ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ వర్గపు ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయలేకపోతోందని, అందుకే నిరంకుశంగా వ్యవహరిస్తూ అణచివేతలకు పాల్పడుతోందని కోదండరాం అన్నారు. నిజమైన బంగారి తెలంగాణా సాధన కోసం టిజెఎసి నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.