పవన్ యాత్రపై తెరాస ఎందుకు స్పందించదు?

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణా యాత్ర గురించే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇటువంటి సందర్భాలలో అందరికంటే ముందుగా స్పందించే తెరాస మాత్రం మౌనం వహించింది. దాని మౌనం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కెసిఆర్ ను వెనకేసుకొని మాట్లాడుతుండటం, ప్రతిపక్షాలకు వారిపై విమర్శలు గుప్పించడానికి ఇంకా మంచి అవకాశం కల్పించింది. 

సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ కు అసలు రాజకీయ నాయకుడి లక్షణాలే లేవు. ఆయనకు కనీసం దళితులు అంటే ఎవరో కూడా తెలియదు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని జైళ్ళకు పంపిస్తూ నిరంకుశపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, చాలా గొప్పగా పాలిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అయినా గతంలో కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే నోటితో ముఖ్యమంత్రిని ప్రశంసిస్తుండటం ఇంకా విడ్డూరంగా ఉంది. అయన ఇద్దరు ముఖ్యమంత్రులకు తొత్తులాగ వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, మందకృష్ణ మాదిగ వంటివారు ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పాదయాత్రలో లేదా దీక్షలకు పూనుకొంటే పోలీసులతో వారిని అడ్డుకొనే తెరాస సర్కార్, పవన్ కళ్యాణ్ కు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతోంది,” అని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర గురించి టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందిస్తూ, “అతని గురించి మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోను,” అని అన్నారు.