రేవంత్ భయ్యా..ఇప్పుడెందుకు ఆ గోల?

డిల్లీ ఆమాద్మీ ప్రభుత్వంలో 21 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి వారికి క్యాబినెట్ హోదా, సౌకర్యాలు కల్పించినందుకు రాష్ట్రపతి సిఫార్సు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వారిపై అనర్హత వేటు వేసింది. దానిని దృష్టిలో ఉంచుకొని తెరాస సర్కార్ లో జోడు పదవులు అనుభవించిన 6 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి, కేంద్ర ఎన్నికల కమీషనర్ కు లేఖలు వ్రాశారు. అయితే వారిపై కాంగ్రెస్ పార్టీ ఇదివరకే హైకోర్టుకు వెళ్ళడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ 6 మంది తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఆ సమస్య సమసిపోయింది. కానీ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఉల్లంఘించినా శిక్ష అనుభవించవలసిందే కనుక వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా రేవంత్ రెడ్డి తన లేఖ. 

కేంద్రప్రభుత్వం డిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వాన్ని మొదటి నుంచి ఏదోవిధంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. చివరికి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సైతం విడిచిపెట్టకుండా అవినీతి కేసులు  బనాయించింది. 

ఆమాద్మీ సర్కార్ లో అసమ్మతి తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి, వారికి క్యాబినెట్ హోదా, సౌకర్యాలు కల్పించి కేంద్రం గుప్పిట్లో చిక్కుకొన్నారు. అది రాజ్యాంగ విరుద్దం. కనుక చాలా కాలంగా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కేంద్రం వెంటనే స్పందించి, తన చేతికి మట్టి అంటకుండా ఆ 21 మంది ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల సంఘం చేత అనర్హత వేటు వేయించింది. ఈ దెబ్బకు కేజ్రీవాల్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోందిప్పుడు. 

అయితే కేంద్రం ఆమాద్మీ సర్కార్ తో వ్యవహరించినట్లుగా తెరాస సర్కార్ తో వ్యవహరించలేదు. పైగా రేవంత్ రెడ్డి పేర్కొన్నవారందరూ ఎప్పుడో తమ  పార్లమెంటరీ కార్యదర్శి పదవులకు రాజీనామాలు చేసేశారు. కనుక రేవంత్ రెడ్డి గాలిలో బాణం విసిరినట్లు చెప్పవచ్చు.