జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ‘చలోరే చలోరే’ పేరిట నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణా రాష్ట్రంలో యాత్ర మొదలుపెట్టబోతున్నారు. ఈ యాత్ర ఉద్దేశ్యం కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలలో తన అభిమానులు, పార్టీ కార్యకర్తలను కలుసుకోవడానికి మాత్రమేనని, ఎటువంటి సభలు, ఉపన్యాసాలు ఉండబోవని జనసేన మీడియా విభాగం స్పష్టం చేసింది.
పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామివారి దర్శనం చేసుకొంటారు. అక్కడి నుంచి కరీంనగర్ చేరుకొని అక్కడ పార్టీ నేతలతో సమావేశమవుతారు. మంగళవారం ఉదయం కరీంనగర్ పట్టణంలో శుభం గార్డెన్స్ లో 10.45 గంటలకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. రేపు సాయంత్రం కొత్తగూడెం చేరుకొని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం తన పార్టీ కార్యకర్తలతో కలిసి కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఎంబి గార్డెన్స్ లో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. దాంతో తెలంగాణాలో యాత్ర ముగించుకొని హైదరాబాద్ చేరుకొంటారు.