నాగర్ కర్నూల్లో గ్రూప్ జంపింగ్

నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్, తెదేపాలకు చెందిన 400 మంది స్థానిక నేతలు, కార్యకర్తలు శనివారం మంత్రులు జూపల్లి కృష్ణారావు సమక్షంలో తెరాసలో చేరారు. కొల్లాపూర్ లోని స్థానిక మహబూబ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ ‘గ్రూప్ జంపింగ్’ కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, “ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలో ఉండే ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా తెరాసలో చేరేందుకు వస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. మా ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీవర్గానికి చెందిన ప్రజలకోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ పధకాలు రూపొందించి అమలుచేస్తున్నందున అందరూ సంతృప్తి చెందుతున్నారు. దేశంలో మరే రాష్ట్రం చేపట్టనన్ని బారీ సాగునీటి ప్రాజెక్టులను మా ప్రభుత్వం చేపట్టి అన్నిటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి, భీమా మొదలైన ప్రాజెక్టులు అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా, కెసిఆర్ కిట్స్ వంటి అనేక సంక్షేమ పధకాలను కూడా దిగ్విజయంగా అమలు చేస్తున్నాము. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి అందరూ తెరాసవైపు ఆకర్షితులవుతున్నారు. రాష్ట్రాభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవడానికి ముందుకు వచ్చిన మీఅందరినీ అభినందిస్తున్నాను,” అని అన్నారు. 

ఒక జిల్లా నుంచి ఒకేసారి ఇంతమంది నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరడంతో కాంగ్రెస్, తెదేపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే భావించవచ్చు. అయితే ఇప్పటికీ చాలా బలహీనపడిన తెదేపాకు దీని వలన కొత్తగా వచ్చిన నష్టమేమీ లేకపోయినా, వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా పెద్ద దెబ్బేనని చెప్పకతప్పదు. సంక్రాంతి పండుగ తరువాత తెదేపా, తెరాస, భాజపాల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి బారీగా వలసలు ఉంటాయని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఇంత మంది తెరాసలోకి వెళ్ళిపోయారు.  కనుక ఇకనైనా కాంగ్రెస్ నేతలు భ్రమలలో నుంచి బయటకు వచ్చి అన్ని జిల్లాలలో తమ నేతలను, కార్యకర్తలను కాపాడుకొంటే మంచిదేమో!