కల్వకుంట్ల కాదు..కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అనాలి: గవర్నర్

గవర్నర్ నరసింహన్ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు చూసిన తరువాత తన సంతోషాన్ని దాచుకోలేకపోయారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మీడియా ప్రతినిధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టును డ్రాయింగులలోనే చూశాను. కానీ ఈరోజు ప్రత్యక్షంగా దాని  నిర్మాణ పనులను చూసిన తరువాత అదొక ఇంజనీరింగ్ అద్భుతమనిపించింది. ఈ ప్రాజెక్టును సందర్శించిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఇకపై కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని, హరీష్ రావును కాళేశ్వరరావు అని పిలవాలనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం వారిద్దరూ ఎంత తపిస్తున్నారో ఎంతగా కృషి చేస్తున్నారో అడుగడుగునా కనబడుతూనే ఉంది. మంత్రి హరీష్ రావుకైతే కాళేశ్వరం అనే పదం లేకుండా మాట్లాడలేరనిపిస్తోంది. దానితో అంతగా అయన మమేకం అయిపోయారు. ఇప్పటి వరకు డ్రాయింగులు, ఫోటో ఎగ్జిబిషన్ లో ఫోటోలు చూపించి మాట్లడినవారినే చూశాను కానీ మొట్టమొదటిసారిగా కంప్యూటర్, మౌస్ పట్టుకొని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి (కెసిఆర్) ని చూశాను. రాజ్ భవన్లో అయన సాగునీటి రంగంపై రెండు గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆరోజే కాళేశ్వరం ప్రాజెక్టు చూడాలని నిర్ణయించుకొన్నాను. ఇప్పటికి అది సాధ్యపడింది. ప్రాజెక్టు పనులను చూసిన తరువాత నా మనసంతా సంతోషంతో నిండిపోయింది.   

ఇప్పటి వరకు దేశంలో సరస్వతి నది ఒక్కటే అంతర్వాహినిగా ప్రవహిస్తోందని విన్నాను. కానీ ఈ ప్రాజెక్టులో 6వ ప్యాకేజీలో జరుగుతున్న సర్జ్ పూల్ పనులను చూసిన తరువాత గోదావరి నది కూడా అంతర్వాహినిగా మారబోతోందని అర్ధమయింది. మరొక ఆరేడు నెలలలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయి పొలాలకు నీళ్ళు అందబోతున్నాయి. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఎంతోమంది ఇంజనీర్లు, అధికారులు, కార్మికులు రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఎంతో తోడ్పడుతుంది. తద్వారా ఆర్ధికాభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న ప్రతీ ఒక్కరినీ అందరినీ పేరుపేరునా అభినందిస్తున్నాను,” అని అన్నారు.