హైదరాబాద్ దేశ 2వ రాజధాని అయితే?

ముఖ్యమంత్రి కెసిఆర్ మొన్న ‘సౌత్ కాంక్లేవ్-2018’ సదస్సులో ఒక ప్రశ్నకు సమాధానంగా “దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ చేస్తానంటే స్వాగతిస్తాము. అది మాకు గర్వకారణమే కదా?” అన్నారు.

దానిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చాలా ఘాటుగా స్పందించారు. “అదే జరిగితే తెలంగాణా రాష్ట్రం నష్టపోతుందని కెసిఆర్ కు తెలియదా? హైదరాబాద్ లేని తెలంగాణా రాష్ట్రం తల, గుండె లేని శరీరం వంటిదని ఆరోజు కెసిఆర్ గట్టిగా వాదించారు. హైదరాబాద్ లేని తెలంగాణా వద్దని కెసిఆర్ గట్టిగా వాదించారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదనను కూడా కెసిఆర్ అందుకే గట్టిగా వ్యతిరేకించారు. అదే కెసిఆర్ ఇప్పుడు హైదరాబాద్ ను దేశ రెండవ రాజధానిగా చేస్తామంటే స్వాగతిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ హైదరాబాద్ ను దేశరెండవ రాజధానిగా చేసినట్లయితే, అప్పుడు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది. అప్పుడు దాని నుంచి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా ఆగిపోతుంది. హైదరాబాద్ ను వదులుకొంటే తెలంగాణా అభివృద్ధి నిలిచిపోతుంది. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సంగతి తెలియకనే కెసిఆర్ ఆ ప్రతిపాదనను స్వాగతించారనుకోవాలా?” అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

ఇక తెలంగాణా రాష్ట్రాభివృద్ధి గురించి ఆ సదస్సులో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన మాటలన్నీ అబద్దాలేనని దాసోజు శ్రవణ్ వాదించారు. “రాష్ట్రం ఏర్పడక ముందు అంటే 2013-14 సం.లలో గ్రామీణ ప్రాంతాలలో వృద్ధిరేటు 21 శాతం ఉండగా, అదిప్పుడు 18.5 శాతానికి పడిపోయిన మాట వాస్తవం కాదా? తెలంగాణా రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెపుతూనే ఈ మూడున్నరేళ్ళలో తెరాస సర్కార్ రూ.90,000 కోట్లు రుణాలు తీసుకొంది. త్వరలో చైనా నుంచి మరో రూ.25,000 కోట్లు గల్ఫ్ దేశాల నుంచి మరో రూ.30,000 కోట్లు రుణాలను సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్ కంటే రెట్టింపు అప్పులు చేస్తున్నప్పుడు ధనికరాష్ట్రమని ఏవిధంగా చెప్పుకొంటున్నారు? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. 

ఆంధ్రా పాలకుల హయంలో విద్వంసం జరిగిందని చెప్పిన కెసిఆర్, మరి అదే ఆంద్రా నేతల కంపెనీలైన నవయుగ, మెగా కంస్ట్రక్షన్ కంపెనీలకు, ఆంధ్రా కాంట్రాక్టర్లకు రాష్ట్రాన్ని ఎందుకు దోచిపెడుతున్నారిప్పుడు? ఇదివరకు రామోజీరావు, నాగార్జున, మోహన్ బాబు, రాఘవేంద్రరావు, లగడపాటి రాజగోపాల్ వంటివారిపై నిప్పులు చెరిగిన కెసిఆర్ ఇప్పుడు వారిని ఎందుకు వెనకేసుకువస్తున్నారు? ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పే మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ పై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శల వర్షం కురిపించారు.