ఆ మూడు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడింది

కేంద్ర ఎన్నికల కమీషనర్ ఎకె జ్యోతి గురువారం త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో 27వ తేదీన ఎన్నికలు నిర్వహించి, మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్చి 3వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో 60 శాసనసభ స్థానాలున్నాయి.  నాగాలాండ్ లో భాజపా, డెమోక్రాటిక్ అలయన్స్ పార్టీల కూటమి అధికారంలో ఉంది. మేఘాలయలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీల కూటమి అధికారంలో ఉంది. త్రిపురలో సిపిఐ (ఎం) అధికారంలో ఉంది.     

త్రిపురలో జనవరి 24 నుంచి 31 వరకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరించుకోవడానికి గడువు ఫిబ్రవరి 3వ తేదీ. ఫిబ్రవరి 18న పోలింగ్ జరుగుతుంది.

నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలలో జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరించుకోవడానికి గడువు ఫిబ్రవరి 12వ తేదీ. ఎన్నికలు ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది.