ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ నాయకులు ప్రజలను కులాలు, మతాలు, వర్గాల వారిగా ‘అడ్రెస్’ చేస్తుంటారు. ఆయా వర్గాల ప్రజలపై మిగిలిన వారికంటే తమకే ఎక్కువ ప్రేమాభిమానాలు ఉన్నాయని, వారి సంక్షేమం కోసం తాము మాత్రమే పరితపిస్తున్నామని గట్టిగా నొక్కి చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా నవంబర్-డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నందున అన్ని పార్టీలు ‘ఎన్నికల బాష’లో మాట్లాడటం మొదలుపెట్టాయి.
తెరాస అధినేత కెసిఆర్ అటువంటి ప్రయత్నాలు చేస్తే విచిత్రమేదీ లేదు కానీ తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బిసిలు, గౌడ్ కులస్థుల సంక్షేమం గురించి మాట్లాడటమే విచిత్రం. హైదరాబాద్ లో అయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ హయంలో హైదరాబాద్ లో కల్లుదుఖాణాలపై నిషేధం విధించి కల్లుగీత కార్మికులపొట్ట కొట్టింది. అది ఒక కులవృత్తిని నిషేదించడంగానే భావించవలసి ఉంటుంది. అదే...మా ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు నాణ్యమైన హైబ్రీడ్ తాటి, ఈత విత్తనాలను సరఫరాచేసి ఆ చెట్లు పెంపకానికి సహకరించింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు చేసిందేమీ లేదు కానీ ఇప్పుడు బీసిల కోసం కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కార్చుతున్నారు. అసలు కులవృత్తులను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అది చేసిన విద్వంసాన్ని మా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సరిచేస్తోంది. రాష్ట్రంలో అన్ని కులాలవారినీ వారి కులవృత్తులు చేసుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టింది. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం మాది,” అని అన్నారు.