త్వరలో పంచాయితీ ఎన్నికలు?

రాష్ట్రంలో గ్రామపంచాయితీలకు ముందస్తు ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఉన్న పంచాయితీలకు జూలై 31వ తేదీతో పదవీకాలం పూర్తవుతుంది కనుక జూలై రెండవ వారంలోగా ఎన్నికలు నిర్వహించి పంచాయితీలకు కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అయితే కేంద్రప్రభుత్వం కూడా సార్వత్రిక ఎన్నికలను 6 నెలలు ముందుగా అంటే నవంబర్-డిసెంబర్ నెలలోగా నిర్వహించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నందున, పంచాయితీ ఎన్నికలను ముందుగా జరిపించి వాటిలో విజయం సాధించడంద్వారా గ్రామస్థాయి నుంచి తెరాసకు గట్టి పట్టు ఏర్పడుతుందని, అది సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి చాలా ఉపయోగపడుతుందని తెరాస అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి రెండవవారంలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించినట్లయితే వాటిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం ఉండదు కనుక ఈ ఎన్నికలలో అవలీలగా గెలవవచ్చునని తెరాస అధినేత భావిస్తున్నట్లు సమాచారం. అయితే ముందుగా ఎన్నికలు నిర్వహించినప్పటికీ ప్రస్తుత పంచాయితీలను వాటి పదవీకాలం పూర్తయ్యేవరకు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ నెలాఖరులోగా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించి వాటిలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త పంచాయితీరాజ్ చట్టాన్ని ఆమోదముద్ర వేయించుకొని, ఆ తరువాత ముందస్తు ఎన్నికలు నిర్వహించడంపై ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా తెలుసుకొన్న తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

గ్రామ పంచాయితీలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని తెరాస భావిస్తుండటం నిజమైతే, ప్రతిపక్షాలను ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయడం కూడా పొరపాటేనని చెప్పవచ్చు. ఇప్పుడు అది చాలా బలంగా కనిపిస్తోంది. తన సత్తాను నిరూపించి చూపుకోవడానికి ఇటువంటి అవకాశం కోసమే అది కూడా ఎదురుచూస్తోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ గ్రామ పంచాయితీలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనుకొంటే కాంగ్రెస్ పార్టీ సంతోషంగా స్వాగతించవచ్చు.