రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖా మంత్రి కేటిఆర్ ఆదివారం విదేశీయాత్రలకు బయలుదేరారు. నేటి నుంచి 22 వరకు దక్షిణ కొరియా, జపాన్ దేశాలలో పర్యటిస్తారు. అక్కడి ఎలెక్ట్రానిక్, టెక్స్ టైల్, ఫార్మా రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యి, ఆయా రంగాలలో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఉన్న సానుకూల పరిస్థితుల గురించి వివరించి పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ఆ తరువాత జనవరి 23 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లో దావోస్ లో జరుగబోయే ప్రపంచ ఆర్ధిక ఫోరం సదస్సులో పాల్గొంటారు. సాధారణంగా ఈ సదస్సుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను మాత్రమే ఆహ్వానిస్తుంటారు. కానీ రాష్ట్రంలో ఐటి, పారిశ్రామికాభివృద్ధికి మంత్రి కేటిఆర్ చేస్తున్న కృషిని, ఆ కారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల ఏర్పాటు చేయడానికి సానుకూల వాతావరణం ఏర్పడటం వంటివి దృష్టిలో పెట్టుకొని ఆయనను ఈ సదస్సుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. పరిశ్రమలు, పెట్టుబడుల గురించి మంచి అవగాహన, చక్కటి వాగ్ధాటి కలిగిన మంత్రి కేటిఆర్ ఈ సదస్సులో పాల్గొనబోయే వివిదదేశాల ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను మెప్పించి రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకొస్తారని ఆశిద్దాం.