మొదటి నుంచి తెరాసలో ఉంటూ ఉద్యమ సమయంలో తెలంగాణా సాధనకై పోరాటాలు చేసినవారిలో చాలా మందికి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత గౌరవం లభించకపోగా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి కీలక పదవులు లభిస్తున్నందున పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి నెలకొని ఉంది. అది అడపాదడపా బయటపడుతుంటుంది. వికారాబాద్ జిల్లాలో తాండూర్ పట్టణానికి చెందిన తెరాస నేత ఆయుబ్ ఖాన్ పార్టీలో తనకు సముచిత స్థానం, గౌరవం లభించలేదనే ఆవేదనతో గత ఏడాది ఆగస్ట్ నెలలో ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకొన్నసంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. పార్టీకి చిరకాలంగా సేవలు చేసినవారిని కాదని కాంగ్రెస్, తెదేపాల నుంచి వచ్చి చేరినవారికి పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యతనీయడంపై హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంతో తెరాసలో కలకలం మొదలయింది.
వారి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వచ్చిన ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మొట్టమొదట స్పందించారు. “నాయిని నర్సింసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోనవసరం లేదు. పార్టీ అవసరాల దృష్ట్యా ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను తీసుకోవడం సహజమే. సుస్థిరమైన ప్రభుత్వం కోసం కొన్నిసార్లు అటువంటి నిర్ణయాలు తప్పవు. కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని తప్పు పట్టలేము,” అని అన్నారు.
చిరకాలంగా పార్టీలో ఉన్నవారిని పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తే అసంతృప్తి పుట్టడం ఎంత సహజమో, ఇతర పార్టీల నుంచి వచ్చినవారు ఈవిధంగా సమర్ధించుకోవడం అంతే సహజమే. కానీ ఎవరు ఎంతగా సమర్ధించుకొన్నా అసంతృప్తిజ్వాలలు మొదలైతే వాటిని చల్లార్చడం కష్టమే. మంత్రిపదవి ఆశించి భంగపడిన శ్రీనివాస్ గౌడ్ బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేయడమే ఆలోచింపజేస్తోంది. ఆయన ఎన్నికలకు ముందు తెరాసకు గుడ్-బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది.