రాష్ట్రంలో రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ పంపిణీ విషయంలో కాంగ్రెస్, తెరాస నేతల మద్య సాగుతున్న మాటల యుద్ధంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ కూడా స్పందించారు. అయితే అయన కూడా బాల్క సుమన్ తదితర తెరాస నేతలలాగే మాట్లాడటం విశేషం.
“ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళివచ్చిన వ్యక్తి (రేవంత్ రెడ్డి) మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉంది. అటువంటి వ్యక్తి ఆరోపణలకు మేము సమాధానం చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని (రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ పంపిణీ) మా ప్రభుత్వం చేసి చూపిస్తున్నందుకే కాంగ్రెస్ నేతలు అసూయతో కడుపు మంటతో నోటికి వచ్చినట్లు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రభుత్వం ఇదేవిధంగా ప్రజోపయోగమైన పనులు చేస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదనే భయం పట్టుకొంది. అందుకే వారు నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ మం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలను నిరూపించేందుకు ఆధారాలున్నట్లయితే కోర్టుకు వెళ్ళవచ్చు. మాకేమీ అభ్యంతరం లేదు,” అని కేటిఆర్ అన్నారు.