వరంగల్ ఉభయజిల్లాలవాసులకు కాస్త నిరాశ కలిగించే వార్తే ఇది. రాగల 7-8 సం.ల వరకు వరంగల్ లో విమానాశ్రయం ఏర్పాటుచేయడం లాభసాటికాదని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-తెలంగాణా (సిఐఐ-టి) చైర్మన్ వి రాజన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వరంగల్ రూరల్ మరియు అర్బన్ జిల్లాల అభివృద్ధికి రూపొందించిన ‘విజన్ 2028 డాక్యుమెంట్’ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ శుక్రవారం వరంగల్ పట్టణంలో అవిష్కరించారు.
సిఐఐ-టి అధ్వర్యంలో జరిగిన ఆ కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్ వి రాజన్న మాట్లాడుతూ, “ప్రస్తుతం వరంగల్ నుంచి హైదరాబాద్, దేశంలో ఇతర ప్రాంతాలకు వచ్చిపోయేవారి సంఖ్యను బట్టి చూస్తే ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు తగినట్లు లేదు. రాగల 7-8 ఏళ్ళలో వరంగల్ ఉభయ జిల్లాలు పారిశ్రామికంగా, ఆర్ధికంగా మరింత అభివృద్ధి చెందితే అప్పుడు విమానాశ్రయం ఏర్పాటు గురించి ఆలోచించవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు లాభసాటి కాదు,” అని అన్నారు.
కానీ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రాజన్ మాట్లాడుతూ, “ఇక్కడ పూర్తిస్థాయి విమానాశ్రయం ఏర్పాటు చేయడం సాధ్యం కానప్పటికీ, చిన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయడం మంచిదని భావిస్తున్నాము. హైదరాబాద్ తరువాత ఆ స్థాయిలో వరంగల్ ఉభయజిల్లాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వరంగల్ జిల్లాలకు ఇకపై రాకపోకలు పెరిగే అవకాశాలున్నాయి కనుక ఇక్కడ తాత్కాలికంగా ఒక ఎయిర్ స్ట్రిప్ అయినా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కొరియన్ కంపెనీతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి,” అని అన్నారు.
పౌరవిమానయనమంత్రిత్వశాఖ కూడా వరంగల్ లో మామునూర్ వద్ద ఇంతకుముందు విమానాశ్రయం కోసం కేటాయించిన భూములలో విమానాశ్రయం ఏర్పాటుచేయడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లయితే మామునూర్ లో మళ్ళీ విమానాశ్రయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.