సిపిఎం నేతృత్వంలో రాష్ట్రంలో గల 31 పార్టీలు కలిసి ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ ఏర్పాటు చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దాని విధివిధానాల గురించి చర్చించేందుకు ఆయా పార్టీల ప్రతినిధులు గురువారం హైదరాబాద్ లోని సుందయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం కాబోతున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, గద్దర్ తదితరులు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు.
సిపిఎం నేతృత్వంలో ఏర్పాటు చేయబోతున్న ఈ కూటమి తెరాసతో బాటు కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకిస్తునందున ఆ పార్టీ దీనిలో చేరడం లేదు. టిజెఎసిని రాజకీయపార్టీగా మార్చేందుకు సిద్దం అవుతున్న ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నందున, అయన పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ ఈ ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ లో చేరక పోవచ్చు. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, తెరాస, భాజపా, కోదండరాం పార్టీ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్, స్వతంత్ర అభ్యర్ధుల మద్య ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికలలో వీటన్నిటి సవాళ్ళు ఎదుర్కొనడానికి తెరాస సిద్దపడక తప్పదు. కానీ నానాటికీ బలపడుతున్న తెరాసను అన్ని పార్టీలు కలిసినా ఓడించగలవా? అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కష్టమేననిపిస్తోంది.