నాగం జనార్ధన్ రెడ్డి కూడా త్వరలో జంప్?

తెరాసలో చేరాలనే ఆశతో తెదేపాకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసిన నాగం జనార్ధన్ రెడ్డిని తెరాస పట్టించుకోకపోవడంతో భాజపాలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ భాజపాలో కూడా ఎవరూ ఆయనను పట్టించుకొన్న దాఖలాలు లేవు. అందుకే అయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేసినందున అయన పార్టీ మారడం గురించి తన అనుచరులతో చర్చించేందుకు ఫలుదఫాలు సమావేశమయ్యారు. వారు కూడా అయన వెంట నడిచేందుకు సంసిద్దత వ్యక్తం చేయడంతో నాగం జనార్ధన్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లే భావించవచ్చు. సంక్రాంతి పండుగ తరువాత ఇతర పార్టీల నుంచి కొన్ని పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేపదే చెపుతున్నారు. రెండు రోజుల క్రితమే భాజపా సీనియర్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయారు. తరువాత నాగం జనార్ధన్ రెడ్డి సిద్దం అవుతున్నారు. ఒకవైపు ఎన్నికలు దగ్గరపడుతుంటే పార్టీలో సీనియర్ నేతలు ఒకరొకరే పార్టీని వీడి వెళ్ళిపోతుండటం ఆ పార్టీకి చాలా నష్టం కలిగించడం ఖాయం.