సామాన్య ప్రజలేకాదు...అప్పుడప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చివరికి సుప్రీం కోర్టు కూడా కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రజలపై బలవంతంగా రుద్దుతాయని చెప్పడానికి చక్కటి ఉదాహరణ సినిమా ధియేటర్లలో జాతీయగీతం ‘జనగణమన’ ను ప్రదర్శించాలని, దానిని ప్రేక్షకులు తప్పనిసరిగా గౌరవించాలని హుకుం జారీ చేయడమే. దానిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రప్రభుత్వం పునరాలోచన చేయకతప్పలేదు.
వినోదం కోసం ఏర్పాటు చేసిన సినిమా ధియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతం ఆలపించడం అవసరం లేదని భావిస్తున్నామని, కనుక సుప్రీం కోర్టు నవంబరు 16, 2016న ఇచ్చిన తీర్పు ముందునాటి స్థితిని యథాతథంగా పునరుద్ధరించాలని కోరుతూ కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టులో సోమవారం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. జాతీయ గీతాన్ని ఏ సందర్భాలలో, ఎక్కడెక్కడ ఆలపించాలనే దానిపై అధ్యయనం చేసేందుకు హోంమంత్రిత్వ శాఖలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఆరు నెలలలో అది నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా జాతీయగీతం ఆలాపనకు విధివిధానాలు నిర్ణయిస్తామని కేంద్రప్రభుత్వం తన అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కనుక అంతవరకు సినిమా ధియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవలసిందిగా కోరింది.