తెలంగాణా విద్యుత్ శాఖలో ఏఐటియూసి, ఐఎన్టీయూసీ, టీఎస్పీఈయూ ఉద్యోగ సంఘాలకు చెందిన పలువురు నాయకులు తెరాస అనుబంధ సంఘమైన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(టిఆర్‌వికెఎస్)లో చేరారు. తెలంగాణా భవన్ లో తెరాస ఎంపి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత సమక్షంలో వారందరూ నిన్న టిఆర్‌వికెఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఎంపి కవిత తెలంగాణా ఉద్యమాలలో విద్యుత్ శాఖ ఉద్యోగులు చేసిన పోరాటాలను గుర్తు చేసుకొని వారిని అభినందించారు. వారి సమస్యలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మూడున్నరేళ్ళలో విద్యుత్ శాఖలో సుమారు 20,000 మంది ఉద్యోగులను తమ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందని చెప్పారు. అందరూ కష్టపడి సాధించుకొన్న తెలంగాణా రాష్ట్రాన్ని మూడున్నరేళ్ళలోనే అభివృద్ధిపధంలో పరుగులు పెట్టించగలుగుతున్నామని అందుకు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు అందిస్తున్న సహాయం అపూర్వమైనదని అన్నారు.
తెలంగాణా ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాను అందించడాన్ని కూడా తప్పు పడుతున్న కాంగ్రెస్ నేతలపై తెరాస ఎంపి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయంలో రైతులకు ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వానికి కూడా అడ్డుపడుతున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తునందుకు ఇతర రాష్ట్రాలు తెలంగాణా ప్రభుత్వాన్ని అభినందిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం చాలా దారుణమని అన్నారు. ఎన్నడూ నిరంతర విద్యుత్ సరఫరా చూసి ఎరుగని కాంగ్రెస్ నేతలు, కరెంటు తీగలు ముట్టుకొంటే పక్షుల్లా మాడిపోతారని ఎద్దేవా చేశారు. కనుక రైతుల కోసం తమ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత, నిరంతర విద్యుత్ పై అభ్యంతరాలు చెప్పడం మానుకోవాలని లేకుంటే ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారని కవిత ప్రతిపక్షాలను హెచ్చరించారు.