దానా కుంభకోణం కేసులో దోష్హిగా నిర్ధారించబడిన బిహార్ మాజీ ముఖ్యమంత్రిలాలూ ప్రసాద్ యాదవ్ (69)కు మూడున్నరేళ్ళు జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విదించబడింది. ఒకవేళ జరిమానా చెల్లించకుంటే మరో ఆరు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని రాంచీలోని సిబిఐ న్యాయస్థానం తీర్పు చెప్పింది. రాంచీలో బిర్సాముండా సెంట్రల్ జైల్లో నిర్బంధించబడిన లాలూ ప్రసాద్ యాదవ్ ను అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి శివపాల్‌సింగ్ విచారించి శిక్ష ఖరారు చేశారు. ఇదే కేసులో దోషులుగా నిర్ధారించబడిన మరో ఏడుగురికి కూడా ఇవే శిక్షలు, జరిమానాలు ఖరారు చేశారు.
న్యాయస్థానం తీర్పు వెలువడగానే, దానిపై హైకోర్టులో అప్పీలు చేస్తామని లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ చెప్పారు. 1990-97 మద్యకాలంలో జరిగిన ఈ కుంభకోణంపై తుది తీర్పు వెలువడకుండా వాయిదాలు వేయిస్తూ లాలూ ప్రసాద్ ఇంతకాలం నెట్టుకొచ్చేయగలిగారు. ఇప్పుడు హైకోర్టులో అప్పీలు చేయడానికి సిద్దపడుతున్నారు. అక్కడ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి మళ్ళీ బెయిల్ సంపాదించుకొని బయటకు రాగలిగితే మరో 10-15 ఏళ్ళు ఈ కేసును కొనసాగించగల సమర్దుడే. కనుక లాలూను ఏ మన దేశంలో ఏ జైలుకూడా ఆపలేదనే చెప్పవచ్చు. లాలూ కుటుంబంలో దాదాపు అందరిపై ఏదో ఒక కేసులు నడుస్తూనే ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో అయన అల్లుడు శిలేష్ కుమార్, కుమార్తె మీసాభారతిలపై ఈడి శనివారం మళ్ళీ రెండవ ఛార్జ్-షీట్ దాఖలు చేసింది.