ఈ నెల నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసాయి. మళ్ళీ ఈ నెల 29 నుంచే బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి. ఈ సమావేశాల మొదటిరోజున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయసభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుంది. దేశంలో జి.ఎస్.టి. విధానం అమలులోకి వచ్చిన తరువాత మొదటిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. కనుక ప్రజలపై అధనపు పన్నుల వడ్డింపులు ఉండకపోవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు గంటలు కూడా మ్రోగుతున్నాయి. కనుక ఈ బడ్జెట్ లో దేశంలో అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకొనే వరాలు ప్రకటించే అవకాశాలున్నాయని భావించవచ్చు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆగిపోయి, సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది కనుక మోడీ సర్కార్ దానికీ ప్రతిపక్షాలు సూచించిన కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ బడ్జెట్ సమావేశాలలో మళ్ళీ ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకొనే ప్రయత్నం చేయడం ఖాయమే.