జూబ్లీ హిల్స్ నడిరోడ్డుపై పట్టపగలే దోపిడీ!

జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఈరోజు పట్టపగలే రోడ్డుపై అందరూ చూస్తుండగానే దోపిడీ జరిగింది. యాదగిరి అనే ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి తన స్నేహితుడి కోసం ఒక షాపు ముందు తన బైక్ పై కూర్చొని ఎదురుచూస్తుందగా హటాత్తుగా ముగ్గురు వ్యక్తులు అతనిని చుట్టుముట్టి కత్తులతో బెదిరిస్తూ అతని జేబులో ఉన్న సెల్ ఫోన్, డబ్బును తీసుకొని అతని బండిపైనే పరారయ్యారు. అప్పుడు యాదగిరి ఒంటరిగా వారితో పోరాడుతున్నప్పుడు రోడ్డుపై అటుగా బైకులు, కార్లలో వెళుతున్నవారందరూ వాహనాలు పక్కన ఆపి అక్కడేదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు అందరూ చూశారే తప్ప ఎవరూ అతనికి సహాయపడేందుకు ప్రయత్నించకపోవడం సిగ్గుచేటు. మరికొందరు యాదగిరి పక్కనుంచే వెళ్ళిపోయారు. ఆ సమయంలో రోడ్డుపై చాలా వాహనాలు తిరుగుతున్నాయి. వారిలో ఏ ఒక్కరూ కూడా ఆ పగటి దొంగలను అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు కనీసం వారిని వెంబడించే ప్రయత్నం చేయలేదు.

ఈ సంగతి తెలుసుకొన్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకొని భాదితుడు ఇచ్చిన ఆధారాలను నోట్ చేసుకొని, అక్కడే ఉన్న సిసి కెమెరాలో రికార్డయిన ఆ దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ పగటి దొంగల కోసం నగరంలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటికే నగరంలో ‘చెడ్డీ గ్యాంగ్’ హడావుడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దోపిడీ జరగడం విస్మయం కలిగిస్తుంది.