భారత్-పాక్ సరిహద్దుల వద్ద గత కొంత కాలంగా యుద్దవాతావరణం నెలకొని ఉంది. బుధవారం సాయంత్రం పాక్ జవాన్లు భారత్ పోస్టుపై ఆకస్మిక దాడి చేయడంతో అక్కడ గస్తీ కాస్తున్న భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఆర్.పి.హజ్రా అనే కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి నిన్న ఆసుపత్రిలో మరణించాడు. ఇటువంటి దాడులకు ధీటుగా బదులివ్వమని ఉన్నతాధికారులు ఆదేశించడంతో భారత జవాన్లు నిన్న రాత్రి పాక్ సరిహద్దులలో ఉన్న మూడు ఆర్మీ పోస్టులను ద్వంసం చేసి అక్కడ గస్తీ కాస్తున్న 12 మంది పాక్ రేంజర్లను హతమార్చి వెనక్కు తిరిగివచ్చారు.
భారత్-పాక్ దేశాల మద్య నెలకొన్న శత్రుత్వం కారణంగా ఏమాత్రం శత్రుత్వం లేని ఇరుదేశాల సైనికులు ఈవిధంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకొంటూ చంపుకోవడం చాలా బాధాకరమే. భారత్ ను దౌత్యపరంగా అంతర్జాతీయ వేదికలపై ఎదుర్కోలేకపోతున్న పాకిస్తాన్ ఈవిధంగా తన అక్కసు తీర్చుకొనే ప్రయత్నం చేస్తోంది.
ఇంతకాలం సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్ ఇక పాకిస్తాన్ కు దానికి అర్ధమయ్యే బాషలోనే చెప్పాలని నిర్ణయించుకోవడంతో ఈ మారణఖండ కొనసాగుతోంది. పాక్ అనాలోచిత నిర్ణయాలకు, దుర్బుద్ధికి భారత్ సైనికులతో బాటు దాని స్వంత సైనికులు కూడా బలైపోతున్నారు. ఇది ఇరుదేశాల సైనికుల కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తోందని అందరికీ తెలుసు కానీ పాక్ వైఖరి మారనప్పుడు భారత్ చేతులు ముడుచుకొని కూర్చోలేదు కనుక తప్పనిసరిగా ధీటుగా బదులివ్వవలసివస్తోంది. కనుక పాక్ తన వైఖరి మారే వరకు ఈ మారణఖాండ కొనసాగుతూనే ఉండవచ్చు. ఇది చాలా బాధాకరమే కానీ అనివార్యంగా మారిందిప్పుడు.