ప్రదీప్ మరో తప్పు చేస్తున్నాడా?

డిసెంబర్ 31 అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చిక్కిన ప్రముఖ టీవీ యాంకర్ మాచిరాజు ప్రదీప్ పై జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, ఘోషా మహల్ వద్ద గల ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ లో ఫ్యామిలీ కౌన్సలింగ్ కు హాజరుకావలసిందిగా కోరారు. కానీ ఆయన దానికి హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మణికొండలో ఆయన ఇంటికి, కూకట్ పల్లిలో అయన కార్యాలయానికి తాళాలు వేసి ఉన్నాయి. అయన మొబైల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉంది. కనుక ప్రదీప్ ఉద్దేశ్యపూర్వకంగానే పరారయినట్లు పోలీసులు తమపై అధికారులకు తెలియజేశారు. అయనకు మరో అవకాశం ఇస్తున్నామని, గురువారం జరిగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు హాజరుకావాలని పోలీసులు మీడియా ద్వారా తెలియజేశారు. ఒకవేళ ఈరోజు కూడా ప్రదీప్ కౌన్సిలింగ్ కు హాజరుకానట్లయితే, ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులకు బదిలీ చేయవలసి వస్తుందని హెచ్చరించారు.          

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పట్టుబడటం అసాధారణమైన విషయమేమీ కాదు. ఆ రోజు అతనితో బాటు ఇంకా చాలా మంది పట్టుబడ్డారు. అయితే ప్రదీప్ సెలబ్రిటీ...అందరికీ తెలిసినవాడు కావడం చేతనే మీడియా ఆయనపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అతను మీడియాకు చెందిన వ్యక్తే అయినా అతనిని కూడా విడిచిపెట్టకుండా మీడియా కాకుల్లా పొడుస్తుండటం విశేషం. 

మోతాదుకు మించి ఎక్కువ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినందున జైలు శిక్ష పడే అవకాశం ఉందనే భయంతోనే ప్రదీప్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని భావించవచ్చు. అయితే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం వలన మరో నేరం చేస్తున్నట్లవుతోంది. కనుక అయన కౌన్సిలింగ్ కు హాజరయితే ఈ కేసు నుంచి త్వరగా బయటపడే ఆవకాశం ఉంటుంది లేకుంటే చేజేతులా సమస్యను ఇంకా జటిలం చేసుకొని మీడియాతో పొడిపించుకొంటూ ఇంకా అప్రదిష్ట మూటగట్టుకోవలసి వస్తుంది.