దానికీ జూన్ 2నే ముహూర్తం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు తెరాస సర్కార్, తెరాస ఎంపిలు కేంద్రప్రభుత్వంపై చేసిన ఒత్తిడి ఫలించింది. తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవం రోజైన జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేంద్రన్యాయశాఖ ఆమోదం తెలిపింది. హైకోర్టు విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. అది జారీ కాగానే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగరాజన్ ఆ ప్రక్రియను ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించి, నాలుగు భవనాలను ఎంపిక చేసి, వాటి వివరాలను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగరాజన్ పంపారు. వాటిని పరిశీలించిన తరువాత అయన సూచించిన భవనాన్ని తాత్కాలిక హైకోర్టు కోసం సిద్దం చేస్తారు. ఈలోగా ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తి చేస్తారు. మే నెలలోగా ఈ విభజన, తరలింపు ప్రక్రియ అంతా పూర్తిచేసి జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాల హైకోర్టులు పనిచేయడం ప్రారంభిస్తాయి.