దేశ ఆర్ధిక రాజధాని..దేశంలో ఆధునికతకు మారుపేరుగా నిలిచే ముంబైలో కుల ఘర్షణలు చెలరేగడం విచిత్రంగానే ఉంది. దళితులకు, మరాఠాలకు మధ్య పూణేలో చిన్నగా మొదలైన ఘర్షణలు రాష్ట్ర రాజధాని ముంబై వరకు ప్రాకాయి. పూణేలో తమపై దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది దళితులు ముంబై చేరుకొన్నారు. ఇవ్వాళ్ళ ముంబై బంద్ కు పిలుపునివ్వగా అది హింసాత్మకంగా మారింది.
నగరంలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు రాళ్ళు రువ్వుకొంటూ కనబడిన వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. ఈరోజు ముంబైలో జరిగిన ఘర్షణలలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అనేకమంది గాయపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి చాలా ప్రయాసపడవలసి వచ్చింది. సుమారు 100 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకొన్నారు.
ములుంద్, చెంబూర్, ఖాండివిల్లీ, విక్రోలీ, కుర్లా బండూప్ తదితర ప్రాంతాలలో దళితులు పెద్ద సంఖ్యలో చేరుకొని ముంబైకు జీవనాడి వంటి లోకల్ రైళ్ళను అడ్డుకొనే ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘర్షణలపై విచారణకు ఆదేశించారు.