అసాధ్యాన్ని కెసిఆర్ సుసాధ్యం చేసి చూపారు అందుకే..

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం ప్రగతి భవన్ కు వెళ్ళి ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారిరువురు సుమారు గంటకు పైగా మాట్లాడుకొన్నారు. 

అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, “ఒక ఉద్యమపార్టీ అయిన తెరాసపై నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. సమైక్యరాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్రం విడిపోతే తెలంగాణాలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతాయని వాదించారు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తూ తెలంగాణా రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపి అయన వాదన తప్పని నిరూపించి చూపారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం కూడా తెలంగాణాను ఆదర్శంగా తీసుకొని పని చేయాలని కోరుకొంటున్నాను. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉచితంగా నిరంతర విద్యుత్ సరఫరా చేయడం నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేసింది. అసాధ్యమనుకొన్న వాటిని ముఖ్యమంత్రి కెసిఆర్ సుసాధ్యం చేసి చూపారు. అయన చేసిన ఈ గొప్ప పనిని అభినందించాలనే ఉద్దేశ్యంతోనే నేను వచ్చాను. మా మద్య ఎటువంటి రాజకీయ చర్చలు జరుగలేదు,” అని అన్నారు.