మూడున్నరేళ్ళ క్రితం కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 2018 సంవత్సరంలోగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నిరంతరంగా రోజుకు 24 గంటలు చొప్పున ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకొంటూ నిన్న డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలు మ్రోగగానే రాష్ట్రమంతటా వ్యవసాయ రంగానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభం అయ్యింది.
ఆదివారం రాత్రి ట్రాన్స్‌కో, జెన్కో సీఎండి ప్రభాకర్‌రావు, ఎస్పీడిసిఎల్, ఎన్పీడిసిఎల్ ఉన్నతాధికారులు, సిబ్బంది రైతన్నల సమక్షంలోనే ఈ నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో ఏకంగా 23 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభం అయ్యింది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సాధించిన అతిపెద్ద విజయంగా దీనిని అభివర్ణించవచ్చు. ఎందుకంటే సమైక్యరాష్ట్రంలో ఎప్పుడూ కరెంటు కోతలను, పవర్ హాలీడేస్ మాత్రమే ఉండేవి. ఆ కారణంగా అనేక చిన్నాపెద్దా పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. పొలాలకు నీళ్ళు పెట్టుకోలేక కళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే అవి చూసి నిరాశా నిస్పృహలకు లోనైన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటుండేవారు. అటువంటి దారుణమైన పరిస్థితుల నుంచి కేవలం మూడున్నరేళ్ళలో రాష్ట్రాన్ని, రైతన్నలను బయటపడేసిన ఘనత తప్పకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ కు, ఆయన నేతృత్వంలో టీం వర్క్ చేసి ఫలితాలు సాధించి చూపుతున్న మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులకే దక్కుతుంది. అందుకు వారినంరినీ పేరుపేరునా అభినందించవలసిందే.
ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది, రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో హాయిగా జీవించాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.