సుమారు రెండు దశాబ్దాల సస్పెన్స్ కు తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం తెర దించారు. తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈరోజు చెన్నై విల్లుపురంలో తన అభిమానులతో సమావేశమైనప్పుడు రజనీకాంత్ ఈ ప్రకటన చేశారు.
అయన తన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను వచ్చే శాసనసభ ఎన్నికలలోగా రాజకీయ పార్టీ స్థాపించబోతున్నాను. కనుక అంతవరకు అభిమానులు ఎవరూ రాజకీయాల గురించి, ఇతర రాజకీయ పార్టీల గురించి మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలు దేశాన్ని దోచుకుతిన్నాయి. కనుక రాజకీయాలలో మార్పుకు ఇదే తగిన సమయం. తమ స్వార్ధం కోసం పనిచేసుకొనేవారు కాదు దేశాన్ని రక్షించుకొనే రక్షకులు కావాలి నాకు. వారు ధైర్యంగా ప్రభుత్వాలను ప్రశ్నించగలగాలి. వారందరికీ నేను ప్రతినిధిగా ఉంటాను,” అని అన్నారు.
రజనీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, “ఇప్పటికీ నేను ఈ సమస్యల పట్ల స్పందించకపోతే ఆత్మన్యూనత, అపరాధభావం నా మనసును దొలిచి వేస్తుంది. ప్రస్తుతం నెలకొన్న భ్రష్టు పట్టిన ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చివేసి కులాలు, మతాలకు అతీతమైన సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మనకు ఆధ్యాత్మిక రాజకీయాలు అవసరం. రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ భ్రష్టు పట్టిపోయాయి. ముఖ్యంగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనందరినీ సిగ్గుతో తలవంచుకొనేలా చేస్తున్నాయి. భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడం అంత తేలిక కాదని నాకు తెలుసు. వచ్చే శాసనసభ ఎన్నికలలో మన పార్టీ మొత్తం 234 స్థానాలకు పోటీ చేయబోతోంది. ఆ ఎన్నికలలో పైనున్న ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు మనకు లభిస్తాయనే నమ్మకం నాకుంది,” అని అన్నారు.
“డబ్బు కోసమో...ఇంకా పేరుప్రతిష్టలు సంపాదించడం కోసమో నేను రాజకీయాలలోకి రావడం లేదు. అవి నాకు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ రాజకీయాలలో...వ్యవస్థలలో పేరుకుపోతున్న మురికిని వదిలించడానికే నేను వస్తున్నాను. గత ఏడాది నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తమిళనాడు ప్రతిష్టను మంటగలిపాయి. మళ్ళీ మనం, మన రాష్ట్రం అందరం గర్వంగా తలెత్తుకొని తిరిగేలా చేసేందుకు రాష్ట్రంలో అభిమాన సంఘాలు అన్నీ చేతులు కలపాలి. ప్రతీ వీధిలో మన ఉనికిని బలంగా చాటాలి. నేను రాజకీయాలలోకి వచ్చి యుద్ధం చేయడానికి సిద్దంగా ఉన్నాను. అందుకోసం ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తాను. నాకు రాజకీయాలు కొత్త కాదు...అవంటే నాకు భం కూడా లేదు. కానీ మీడియా అంటేనే ఎక్కువ భయం. రాజకీయాలలో కొమ్ములు తిరిగిన వారు సైతం మీడియాను చూసి భయపడుతున్నారు,” అన్నారు రజనీ కాంత్.