తెలంగాణా పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చి 42 నెలలు పూర్తయింది. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. 2014 ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయినా తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు నేటికీ గత ప్రభుత్వాలను నిందిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా ఎంత కాలం గత ప్రభుత్వాలను నిందిస్తారు? ఈ 42 నెలలలో మీరు చేసింది ఏమిటి?” అని ప్రశ్నించారు.
“మేము జడ్చర్లలో నిర్వహించిన జనగర్జన సభకు ప్రజల నుంచి వచ్చిన గొప్ప స్పందన చూసి తెరాస నేతలకు మనసులో గుబులు పట్టుకొంది. అందుకే అందరూ కట్టకట్టుకొని దానికి పెద్దగా ప్రజలు హాజరుకాలేదని, ఆ సభ విఫలం అయ్యిందని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అది విఫలం అయ్యిందో లేక విజయవంతం అయ్యిందో, డానికి ఎంతమంది ప్రజలు తరలివచ్చారో మీకు ఇంటలిజన్స్ వర్గాలు సమాచారం ఇచ్చే ఉంటాయి కదా? దమ్ముంటే దానిని బయటపెట్టగలరా? మంత్రి లక్ష్మారెడ్డి మా కాంగ్రెస్ నేతలను రెచ్చగొట్టవద్దని హెచ్చరిస్తున్నాను,” అన్నారు మల్లు రవి.
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఇదివరకు కూడా అనేకసార్లు బహిరంగ సభలు నిర్వహించింది. కానీ వాటి గురించి తెరాస నేతలు పట్టించుకొన్న దాఖలాలు లేవు. కానీ జడ్చర్లలో జరిగిన జనగర్జన సభ గురించి తెరాస నేతలు కాస్త ఎక్కువగా మాట్లాడటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. మల్లు రవి చెపుతున్నట్లు అది విజయవంతం కావడం. 2. దానిలో రేవంత్ రెడ్డి రెచ్చిపోయి మంత్రి లక్ష్మారెడ్డిపై విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేయడం. ఈ రెంటిలో ఏది నిజమో కాంగ్రెస్, తెరాస నేతలకే తెలియాలి.