తాజా సమాచారం! మన ముఖ్యమంత్రి కెసిఆర్ వాళ్ళిద్దరి పేర్లు వింటే ఉలిక్కి పడతారుట! ఈ రహస్యం బయటపెట్టిన వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా! అయితే వాళ్ళను చూసి కెసిఆర్ ఎందుకు భయపడతారో చెప్పడం మరిచిపోయారు ఆ పెద్ద మనిషి. బహుశః గుజరాత్ లో మోడీకి రాహుల్ గాంధీ ముచ్చెమటలు పట్టించేసినందున ఆయనను చూసి కెసిఆర్ భయపడుతున్నారని అయన ఉద్దేశ్యం కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కొడుకుకు అప్పగించేసి గోవాలో సైకిల్ తొక్కుకొంటున్న సోనియా గాంధీని చూసి కెసిఆర్ ఎందుకు భయపడాలో అర్ధం కావడం లేదు. ఏమైనప్పటికీ వాళ్ళను చూసి కెసిఆర్ భయపడతారని కుంతియావారు కన్ఫర్మ్ చేసేశారు బాగానే ఉంది. కానీ 2014 ఎన్నికలకు ముందు తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఎందుకు పట్టుబట్టారో కుంతియాకే తెలియాలి. అందుకు కెసిఆర్ అంగీకరించకపోవడంతో కనీసం మాతో ఎన్నికల పొత్తులుకైనా అంగీకరించమని కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ను ఎందుకు ప్రాధేయపడిందో ఆయనే చెప్పాలి. దానికీ కెసిఆర్ అంగీకరించకపోవడంతో ‘మేమే తెలంగాణా రాష్ట్రం తెచ్చాం..మేమే ఇచ్చాము...కనుక తెలంగాణా ప్రజలు తప్పకుండా మమ్మల్నే గెలిపిస్తారు’ అని ప్రగల్భాలు పలికి ఎందుకు బోర్లాపడ్డారో కుంతియా చెపితే బాగుండేది. కానీ చెప్పలేదు.
తెలంగాణా ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీని తెలంగాణా ప్రజలు పట్టించుకోలేదు పాపం! మరి ఈ ఐదేళ్ళలో తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో కెసిఆర్ పరుగులు పెట్టిస్తున్నప్పుడు, 2019 ఎన్నికలలో ఆయనను రాహుల్ గాంధీ ఏవిధంగా ఎదుర్కొంటారో కాస్త చెపితే బాగుండేది కదా!