మోనో రైలుతో మెట్రో ఆదాయానికి గండి?

మెట్రో రైల్ లాభసాటిగా నడవాలంటే రోజుకు కనీసం 2-2.5 లక్షల మంది ప్రయాణించవలసి ఉంటుందని ఒక అంచనా ఉంది. కానీ ప్రస్తుతం రోజుకు సగటున లక్ష మంది మాత్రమే ప్రయాణిస్తున్నారని మెట్రో రైల్ ఎండి ఎన్.వి.ఎస్.రెడ్డి స్వయంగా చెప్పారు. అమీర్ పేట-హైటెక్ సిటీలను కలుపుతున్న మెట్రో కారిడార్ కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే అప్పుడు ప్రయాణికుల సంఖ్య ఆ స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హైటెక్ సిటీ వరకు మోనో రైల్ ఏర్పాటుచేయడానికి సిద్దం అవుతోంది. మెట్రో రైల్ తో పోలిస్తే మోనో రైల్ వ్యవస్థ నిర్మాణం, నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగానే ఉంటాయి కనుక మెట్రో టికెట్ ధరలతో పోలిస్తే వాటి టికెట్ ధరలు కూడా తక్కువగానే ఉండవచ్చు. కనుక సహజంగానే ప్రజలు మోనో రైలు ప్రయాణానికి మొగ్గు చూపవచ్చు. 

ఇప్పటికే ఎం.ఎం.టి.ఎస్. ఆర్టీసి నుంచి మెట్రో రైల్ పోటీని ఎదుర్కోవలసి వస్తోంది. ఇప్పుడు మోనో రైల్ కూడా వచ్చినట్లయితే, మెట్రో ఆదాయంపై ప్రభావం చూపే ప్రమాదం ఉండవచ్చు. వేలకోట్లు ఖర్చు చేసి నిర్మించుకొన్న మెట్రో రైల్ లాభసాటిగా నడవడం చాలా అవసరం. కనుక మెట్రో రైల్ నిలద్రొక్కుకొనేవరకు దానికి సమాంతరంగా మరో రవాణా వ్యవస్థను ఏర్పాటుచేయకపోవడమే మంచిదేమో? ఒకవేళ ఏర్పాటుచేయదలచుకొంటే మెట్రో కారిడార్స్ వేయడానికి ఇబ్బందికరంగా ఉన్న హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో వేస్తే అక్కడి ప్రజలకు ప్రయోజనం, మోనో రైల్ వ్యవస్థకు లాభం ఉంటుంది. అలాగే నగరంలో మెట్రో కారిడార్స్ లేని వేరే ఇతరప్రాంతాలలో ఈ మోనో రైల్ వ్యవస్థను ఏర్పాటు చేసినా బాగుటుంది కదా!