హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మోనో రైలును కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీనిని అత్యంత రద్దీగా ఉండే మియాపూర్-శిల్పారామం- హైటెక్స్- న్యాక్- హైటెక్ సిటీ- ఐటీ కారిడార్-గచ్చిబౌలి ప్రాంతాల మద్య ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 15కిమీ నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టిపిఐసిసి)ని దీనికి నోడల్ సంస్థగా నియమించింది.
రాబోయే 30 ఏళ్ళలో నగరంలో పెరుగబోయే జనాభా, మోనో రైల్ నిర్మాణం, దానికి అయ్యే ఖర్చు, నిర్వహణ, దాని లాభనష్టాలు మొదలైన అంశాలపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు గాను టిపిఐసిసి టెండర్లను ఆహ్వానించింది. ఆ నివేదిక ఆధారంగా మోనో రైలు నిర్మాణం ఎప్పుడు ఏవిధంగా చేప్పట్టాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొంటుంది. మెట్రో రైలుతో పోలిస్తే మోనో రైలు కారిడార్ నిర్మించడం సులువు. తక్కువ ఖర్చుతో కూడుకొన్నది. పైగా మోనో రైల్ నిర్వహణ లాభసాటి అని నిరూపితమైంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీని ఏర్పాటుకు సిద్దం అవుతోంది. అన్నీ అనుకొన్నట్లు సజావుగా జరిగితే 2018 చివరిలోగా దీని నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.