
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబోలో వస్తున్న అజాతవాసి ఆడియో నిన్న నోవాటెల్ లో గ్రాండ్ గా జరిగింది. కేవలం చిత్రయూనిట్ సమక్షంలోనే ఈ సినిమా ఆడియో జరిగింది. ఇక సినిమా ఆడియో వేడుకలో చివరగా ప్రసంగించిన పవన్ ఎప్పటిలానే అదరగొట్టాడు. సినిమాల ద్వారా ఇంత ప్రేమను.. అభిమానాన్ని ఇచ్చిన దేశానికి వందనాలు చెబుతూ భారత్ మాతాజీ జై.. భారత్ మాతాకీ జై.. అంటూ మాట్లాడటం మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్.
అభిమానించినే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేంత విశాలమైన హృదయం తనకు ఉందని.. శరీరమే చిన్నది అన్నారు. ఇక ఇక్కడకు వచ్చిన అభిమానులే కాదు బయట ఉన్న వారు.. టివిల్లో చూస్తున్న వారందరికి తన కృతజ్ఞతలు తెలిపాడు. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇంతమంది అభిమానులను సంపాదిస్తానని అనుకోలేదని.. నా వల్ల సమజానికి ఎంతో కొంత చిన్నపని చేస్తే చాలని ఉంటుందని అన్నారు. ఇక ఇంతటి అభిమానంతో రాజకీయ పార్టీ పెట్టి.. ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లేలా ఫ్లాట్ ఫాం ఇచ్చిన సినిమా తల్లికి పాదాభివందనం అని అన్నారు.
ఓ పది పన్నెండు సినిమాలు చేసి ఆగుదామనుకుంటే.. ఖుషి తర్వాత మరో ఐదు సినిమాలు చేసి ఆపేద్దామని అనుకున్నా కాని ప్రేమతో మీరు పాతిక సినిమాలు చేసేలా చేశారు. నేనెప్పుడు ఓటమికి భయపడలేదు.. గెలుపుకి పొంగిపోలేదు. అయితే ఒక్కోసారి మన పని వల్ల అసూయ ద్వేషాలు పెరుగుతాయి. అందుకే దూరంగా వెళ్లిపోవాలనిపించిందని అన్నారు. ఇక తను చేయూతనిచ్చిన వారు అండగా నిలిచిన వారు తను ఒంటరిగా ఉన్నప్పుడు సహకరించలేదని చెప్పిన పవన్ తను బాధలో ఉన్నప్పుడు దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ సపోర్ట్ గా నిలిచాడని అన్నాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన త్రివిక్రం కు తన అవసరం లేదని.. తనకు కోపం వస్తే త్రివిక్రం ను అరచేంత చనువు ఉందని అన్నారు.
ఇక మధ్యలో అభిమాని భారత దేశపు మువ్వన్నెల జెండా చూపిస్తే.. అది నాకిష్టమైన జెండా.. అది చూస్తే నా గుండె ఉప్పొంగుతుందని అన్నారు. ఆ జెండా కోసం రాజకీయాల్లోకి వెళ్లానే తప్ప మరెందుకు కాదని అన్నారు. ఏ కళకైనా అంతిమ లక్ష్యం సమాజానికి ఉపయోగపడడమే.. శక్తి ఉండగానే సమాజానికి ఉపయోగపడాలి.. ఇక అభిమానులను ఉద్దేశించి మీరు నాకు ఎంత అండగా ఉన్నారో తెలుసని.. నేను నిమ్మిత్తమాత్రుడనని.. నన్ను కొందరు తిట్టేవారని.. తాను కాలం శక్తిని నమ్ముతానని.. కాలం శక్తి చాలా గొప్పదని.. సినిమాల్లోకి వచ్చినా మీ హృదయాల్లో స్థానం సంపాదించిన అది కాలం శక్తి మాత్రమే అని అన్నారు.
ఇక సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ కు తన కృతజ్ఞతలు తెలిపి.. మీ అందరి అభిమానం ఇలానే ఉండాలని కోరుకుంటూ జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు పవన్ కళ్యాణ్.