ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ మృతి

ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ (79) సోమవారం సాయంత్రం ముంబైలో కోకిలా బెన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అయన గత కొంత కాలంగా వృద్దాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. 1940లో బాల నటుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన అయన సుమారు 50 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ ఆయన చేసిన సినిమాలు 116 మాత్రమే. కానీ వాటిలో అత్యధిక శాతం సూపర్ హిట్సే. మరపురాని గొప్ప సినిమాలే. ముఖ్యంగా 1970-80 లలో అయన హిందీ చిత్రపరిశ్రమను ఏలారని చెప్పవచ్చు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, సంజయ్ కుమార్, కిషోర్ కుమార్, రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, రాజ్ కపూర్, ధర్మేంద్ర వంటి హేమహేమీలైన అనేకమంది హీరోలున్నప్పటికీ, శశికపూర్ ఒక వెలుగు వెలిగారు. తెలుగులో రోమాంటిక్ సినిమాలకు ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి హీరోలు ఏవిధంగా ప్రసిద్ధులో, హిందీలో శశికపూర్ అటువంటివారని చెప్పవచ్చు.

ఆయన 61 సినిమాలలో హీరోగా నటించారు. వాటిలో షర్మీలీ, కబీ కబీ, రోటి కపడా మకాన్, సత్యం శివం సుందరం, హసీనా మాన్ జాయేగి, ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి, ప్యార్ కా మౌసం, బెఫనా వంటి అనేక సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అదేవిధంగా అయన నటించిన దాదాపు అన్ని సినిమాలలో పాటలు, సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకు ఉదాహరణగా బాబీ సినిమాలో ‘జూట్ బోలే కవ్వా కాటే’, ప్రేమ్ రోగ్ సినిమాలో ‘మైహూ..మైహూ ప్రేమ్ రోగీ.. శ్రీదేవి హీరోయిన్ గా చాందినీ సినిమాలో ఓ...మేరీ చాందినీ వంటి అనేకానేక మరపురాని గీతాలు అయన సినిమాలో ఉన్నాయి. అవే ఆయనను ఎప్పటికీ ప్రజలో గుండెల్లో చిరస్థాయిగా నిలిపి ఉంచుతాయి.

 అయన సినీ జీవితంలో అనేకానేక అవార్డులు అందుకొన్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినవి 2011 లో పద్మభూషణ్, 2015లో దాడా సాహెబ్ ఫాల్కే అవార్డులు. అవి కాక మూడుసార్లు జాతీయ అవార్డులు, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, అనేక ఇతర అవార్డులు అందుకొన్నారు.

దాదాపు అర్ధ దశాబ్దం పాటు హిందీ పరిశ్రమలో నిలిచిన ఆయన గురించి ఈవిధంగా చెప్పుకోవడం కొండను అద్దంలో చూపించే చిన్న ప్రయత్నమే. శశికపూర్ మరణంతో బాలీవుడ్ ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు. ఆయనకు బాలీవుడ్ ప్రముఖులు అందరూ నివాళులు అర్పిస్తున్నారు.