
తెలుగు సినీ ఇండస్ట్రీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇంటిపై ఓ యువకుడు దాడికి ప్రయత్నించాడు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసుల వివరణ ఈ విధంగా వుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామదాసు కథ తనదేనంటూ అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లికి చెందిన వల్లిపి రవీంద్ర(28) ఆరోపిస్తూ, రాఘవేంద్రరావు నివాసానికి వచ్చాడు. అదే సమయంలో రాఘవేంద్రరావు తన కారులో బయటకు వెళ్తుండగా రవీంద్ర ఆ కారును అడ్డగించి దుర్భాషలాడుతూ కారు డోర్ పగులగొట్టేందుకు ప్రయత్నించాడు.
అయితే వెంటనే కారు దిగి ఎవరు నువ్వు.. నీ సమస్యేంటి అంటూ రాఘవేంద్ర రావు ప్రశ్నించడంతో, 2006లో తీసిన శ్రీరామదాసు కథ తనదేనని, ఆ కథను 2003లోనే సిద్ధం చేసి మీకు పంపించానని, కానీ ఆ సినిమాలో రచయితగా మాత్రం వేరే వాళ్ల పేరు వేసి తనను మోసం చేసారంటూ రాఘవేంద్రరావును రవీంద్ర నిలదీశాడు. కానీ రాఘవేంద్రరావు ఆ కథ భారవిదని చెప్తుండగానే మళ్లీ రవీంద్ర దర్శకుడిని తిట్టడం మొదలెట్టడంతో వెంటనే అక్కడినుంచి ఆయన కారులో వెళ్లిపోయారు.
దీంతో రవీంద్ర ఆగ్రహంతో ఓ రాడ్ ను తీసుకొని రాఘవేంద్రరావు నివాసంలోని ఆడి కారు, బెంజి కారు, సాంట్రో కార్లను ధ్వంసం చేసాడు. ఇంటి అద్దాలు పగలగొట్టాడు. అడ్డువచ్చిన వాచ్ మెన్ పై దాడి చేసాడు. ఇళ్లంతా భీభత్సం సృష్టిస్తున్న సమయంలో రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ రావు వెంటనే అప్రమత్తమపై ఏం చేస్తున్నావంటూ రవీంద్రను నిలదీశాడు. కానీ ప్రకాశ్ పై కూడా దాడి చేయడానికి రవీంద్ర ప్రయత్నిస్తున్న సమయంలో వాచ్ మెన్ వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ రవీంద్రను సెక్యురిటీ గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు.
బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని రవీంద్రను అరెస్ట్ చేసారు. రవీంద్రపై ఐపిసి సెక్షన్ 452, 427 కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.