
ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణీ తెరకెక్కుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బిబో శ్రీనివాసరావు సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో విడుదలైన క్షణం నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇదిలా వుంటే రేపు(జూన్10) నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సంధర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణీలోని తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో బాలయ్య లుక్ అదిరిపోయింది. సమరసంగ్రామంలో పోరాడే ఓ యుద్ధవీరుడిగా బాలయ్య లుక్ అదిరిపోయింది. అలాగే బాలయ్య గెటప్ చాలా కొత్తగా, విభిన్నంగా వుంది. ఈ పోస్టర్ చూస్తుంటే దర్శకుడు క్రిష్ చాలా కేర్ తీసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అభిమానులు ఊహించినదాని కంటే కొత్తగా ఈ పోస్టర్ వుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. ప్రస్తుతం హైదరబాద్ లోని చిలుకురీ బాలాజీ టెంపుల్ సమీపంలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అందాల భామ శ్రియ హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో శ్రియ పాల్గొననుంది.
ఇక ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించేసాడు. లెజెండ్ ను మించిన రీరికార్డింగ్ థియేటర్లు దద్దరిల్లే విధంగా, బాలయ్య అభిమానులు ఆనందించే విధంగా దేవి ట్యూన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు. భారీ అంచనాలతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.