పాటలకు ఇక సెలవు..!

తన స్వర మాధుర్యంతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాన కోకిల గొంతు ఇకపై మూగబోనుంది. తాను ఎక్కడైతే ప్రస్థానం మొదలు పెట్టిందే అక్కడే ముగింపు పలికింది గాన కోకిల ఎస్ జానకి.  వివిధ భాషల్లో తన గానామృతంతో దాదాపు 65 సంవత్సరాల పాటు అభిమానులను అలరించారు జానకమ్మ. తొలిసారి 1952లో దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్ తో కలిసి మైసూరు నుంచే పాటలను పాడి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది జానకి. 

నేపధ్యగాయనిగా ఎన్నో పాటలతో అలరించిన జానకమ్మ ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం, 31 సార్లు వివిధ రాష్ట్రాల పురస్కారాలు.. ఒక్కటేమిటి ఆ పాటలకు మంత్రముగ్ధులైన ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెకు ఇచ్చారు. ఆ మద్య దక్షిణాది కళాకారులపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని తనకు ఆ గౌరవం ఆలస్యంగా దక్కిందనే కారణాలతో జానకి ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. ది నైటెంగెల్‌ ఆఫ్‌ సౌత్ అని అభిమానులు సగర్వంగా పిలుచుకునే జానకమ్మ 1957లో తమిళ సినిమా విదియున్ విళయాట్టుతో గాయనిగా రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.