
ముకుంద, కంచె, లోఫర్ చిత్రాల తర్వాత వరుణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగిపోయిందంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. పలు అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసారంటూ టాలీవుడ్ లో రకరకాల పుకార్లు వినిపించాయి.
అయితే ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వరుణ్ తేజ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చేసాడు. ఈ సినిమా గురించి వరుణ్ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ... శ్రీనువైట్లతో నా సినిమా ఈనెల 27న స్పెయిన్ లో ప్రారంభం కానుంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ‘మిస్టర్’పై వస్తున్న పుకార్లకు బ్రేక్ పడినట్లుగా అయ్యింది. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమా ఈనెల 27నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇక ఆగడు, బ్రూస్ లీ వంటి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల, ఈ మిస్టర్ సినిమాతో ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో వున్నాడు. అందుకోసం పక్కాగా ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా కోసం నిర్వహించిన ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.