
చిన్న సినిమాలతో కూడా మంచి హిట్టు కొట్టవచ్చంటూ ఇప్పుడున్న యువ హీరోలు తెగ ప్రయత్నిస్తున్నారు. అందులో హీరో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా రేపు, జూన్ 10న విడుదల కానుంది. ఇందులో నిత్య హీరోయిన్ అనగానే అంచనాలు బాగా పెరిగాయి. మాములుగా కథలో మ్యాటర్ లేకపోతే ఈ అమ్మడు సినిమాలు ఒప్పుకోదు. కాబట్టి ఒక్క అమ్మాయి తప్ప సినిమాకు నిత్యామీనన్ మెయిన్ హైలెట్ అయ్యింది.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రేపు విడుదలవుతున్న ఈ సినిమా రన్ టైం 2గంటల 14 నిమిషాలు మాత్రమే. ఈమధ్య వస్తున్న సినిమాల రన్ టైం చాలా ఎక్కువగా వుండటం వల్ల చూసే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. అందువల్ల ఒక్క అమ్మాయి తప్ప సినిమాను పర్ఫెక్ట్ ఎడిటింగ్ తో రన్ టైం సెట్ చేసారు. ఈ సినిమా ఔట్ పుట్ చూసి చిత్ర యూనిట్ విజయంపై మంచి ధీమాతో వున్నారు.
లవ్, యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ద్వారా, రచయిత రాజసింహ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫిని అందించారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమా ట్రైలర్, వీడియోలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది గంటల్లోనే తెలియనుంది.