కాశ్మీర్ లో శిరీష్ శ్రీరస్తు శుభమస్తు

గౌరవం, కొత్త జంట చిత్రాల తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న మెగా హీరో అల్లు శిరీష్ హీరోగా ప్రస్తుతం ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆంజనేయులు, సారొచ్చారా వంటి మ్యూజికల్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు పరుశురామ్(బుజ్జి) దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా శ్రీరస్తు శుభమస్తు. ఈ ఏడాది సరైనోడు సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్న భారీ బడ్జెట్ చిత్రాల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీరస్తు శుభమస్తు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ కాశ్మీర్ లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో శిరీష్ సరసన అందాల భామ లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటిస్తుంది. శిరీష్-లావణ్యల జోడి సినిమాకు ప్లస్ అవనున్నట్లుగా తెలుస్తోంది.

షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసారు.  మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కుటుంబంలోని ఎమోషన్స్, భాద్యతలు, లవ్ ఇలా ప్రతి అంశాలతో రూపొందనున్నఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేయనున్నారు.