ఎంతపని చేశావే శిరీషా ఫస్ట్ లుక్

మహత్ రాఘవేంద్ర, పునర్నవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఎంతపని చేశావే శిరీషా. ఓవర్సీస్ ఎంటర్ టైన్మెంట్ నెట్ వర్క్ బ్యానర్లో శివరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప‌ట్లూరి బాల‌కృష్ణ‌, రామ్ ప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కాన‌ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను విడుదల చేసారు.

ఆవిష్కర‌ణ కార్యక్రమాన్ని హైద‌రాబాద్‌లో జరుపుకున్న ఈ చిత్ర బ్యానర్ లోగోను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.రామ్మోహన్ విడుదల చేయగా, టైటిల్ లోగోను అనిల్ సుంకర ఆవిష్కరించారు. ఈ టీజర్ లో సినిమాకు సంబంధించిన ఎలాంటి సీన్లు లేకపోయినా, ఫోటోలను మాత్రమే వీడియో రూపంలో డిజైన్ చేసి విడుదల చేసారు.

ఈ కార్యక్రమంలో పునర్నవి మాట్లాడుతూ, తనకు ఈ కథ చాలా బాగా నచ్చిందని, కథ విన్నంతసేపూ ఎగ్జయిట్ అయ్యానని తెలిపింది. షూటింగ్ కూడా పూర్తయ్యిందని, సినిమా ఎంత కలర్ ఫుల్ గా వుంటుందో టీజర్ మరియు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పుకొచ్చింది.

లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. పూర్ణచందర్ భైరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను త్వరలోనే విడుదల చేసి, సినిమాను ఆగష్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.