రాం చరణ్ ధృవ విడుదలయ్యేది అప్పుడే

బ్రూస్ లీ-ది ఫైటర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ చాలా గ్యాప్ తీసుకొని నటిస్తున్న తాజా చిత్రం ధృవ. తమిళంలో జయం రవి, నయనతార, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో నటించిన థని ఒరువన్ సినిమాను తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా 75 శాతం పూర్తయినట్లుగా తెలిసింది. ఇటీవలే హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ఈ షెడ్యూల్ లో రాం చరణ్ పాల్గొంటున్నాడు. రాం చరణ్ పై ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ముందుగా ఆగష్టులోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ధృవ సినిమాను సెప్టెంబర్ నెల చివర్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. ఇందులో చరణ్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అరవింద్ స్వామి నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా చిత్ర దర్శకనిర్మాతలు తెలియజేయనున్నారు.